Saturday, October 19, 2019
Follow Us on :

మా చేతుల్లో లేదు...పాక్‌తో మ్యాచ్‌పై స్పందించిన విరాట్‌ కోహ్లీ

By BhaaratToday | Published On Feb 23rd, 2019

పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్‌లో పాకిస్థాన్‌పై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా దాడిని ఖండించడంతో పాటు పాక్‌కు సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొందరు ఈ మ్యాచ్‌ను ఆడొద్దని, మరికొందరు పాక్‌ను ప్రపంచకప్‌ నుంచి బహీష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విష‌య‌మై శుక్రవారం క్రికెట్‌ పాలక కమిటీ (సీఓఏ) సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కానీ మ్యాచ్‌ను బహిష్కరించాలా లేక ఆడాలా అన్న విషయంపై సీఓఏ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం విశాఖలో ఉన్న భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి పాక్‌తో మ్యాచ్ గురించి స్పందించాడు. ఆదివారం ఆసీస్‌తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విష‌యమై మాట్లాడాడు. ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేదీ లేనిది తమ చేతిలో లేదని స్పష్టం చేశాడు. అలాగే ఆ దేశంతో మ్యాచ్ ఆడే విషయంపై భారత ప్రభుత్వం, బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని గౌరవిస్తామని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌పైనే ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.