Thursday, November 14, 2019
Follow Us on :

మాట నిల‌బెట్టుకోండి.. మీ రాజీనామా కోసం ఎదురుచూస్తున్నాం

By BhaaratToday | Published On Jun 21st, 2019

కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు మొహాలీలో చేదు అనుభవం ఎదురైంది. మీరెప్పుడు రాజీనామా చేస్తారు సిద్ధూజీ అంటూ ఆయన పేరిట పోస్టర్లు వెలిశాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెనయిర్‌గా సిద్ధూ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఓడించి తీరతారని, అలా జరగని పక్షంలో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని శపథం చేశారు. అన్ని పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు.

అయితే.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్‌ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి కేంద్రమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో..‘ సిద్ధూ రాజకీయాల నుంచి ఎప్పుడు వైదొలుగుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీ రాజీనామా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు మొహాలీలో పోస్టర్లు అంటించారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలిచే సిద్ధూ ప్రస్తుత పరిణామాలపై స్పందించలేదు.