Sunday, August 25, 2019
Follow Us on :

అలా చేసినా రేప్ కిందికే వ‌స్తుంది..ఓ కేసులోసుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By BhaaratToday | Published On Apr 15th, 2019

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో సెక్స్‌లో పాల్గొని చివ‌ర‌కు పెళ్లికి నిరాకరిస్తే అది రేప్‌ కిందికే వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ ఎమ్‌ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఓ కేసులో ఈ విధంగా తీర్పునిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతికి, అనురాగ్‌ సోని అనే వ్యక్తికి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అనురాగ్‌ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ 2009లో సహజీవనం చేశారు. ఆమె లైంగికంగా అతనికి దగ్గరైంది. ఆ తర్వాత అతడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని హైకోర్టు కూడా సమర్ధించింది. దీంతో అనురాగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించాడు కాబట్టి ఆమె సమ్మతిని సాధారణ అనుమతిగా పరిగణించలేమని తెలిపింది. లైంగికంగా దగ్గరవడానికి ఆమె ఒప్పుకున్నప్పటికీ అది రేప్‌ కిందకే వస్తుందని పేర్కొంది. రేప్‌ హత్య కన్నా ఘోరమైనదని కోర్టు అభిప్రాయపడింది. హత్య శరీరానికి సంబంధించినదైతే రేప్‌ శరీరంతో పాటు మనసుకు సంబంధించిందని.. ఆ బాధ జీవితాంతం వెంటాడుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.