Monday, November 18, 2019
Follow Us on :

టెక్నాలజీ వండర్.. విశాఖలోని ఈ చమురు గుహ

By BhaaratToday | Published On Feb 10th, 2019

 ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేస్తున్న విశాఖలోని వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రం దేశంలోనే అపూర్వ నిర్మాణం.  స్వీడన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత అధునాతనంగా శత్రు దుర్భేద్యంగా రూపుదిద్దుకుందీ కేంద్రం.. తీవ్ర భూకంప పరిస్థితులను సైతం తట్టుకోగలిగేలా దీన్ని తీర్చిదిద్దటం విశేషం. ప్రపంచంలో ముడిచమురుకు ఎంత తీవ్రమైన కొరత తలెత్తినా కనీసం 90 రోజులపాటు దేశ చమురు అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కలంగా చమురు నిల్వలు అందుబాటు ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం చమురు వ్యూహాత్మక నిల్వల కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది. యుద్ధాలు, చమురు సంక్షోభాలు, అత్యవసర పరిస్థితులు, విపత్తులు ఏవి ఎదురైనా దేశ చమురు అవసరాల్ని తీర్చేందుకు అనువుగా కట్టుదిట్టమైన భద్రతా పరిస్థితుల్లో ఆయా నిల్వలు ఉంచాలన్న లక్ష్యంతో వీటిని నిర్మించారు. తొలుత ఏపీలోని విశాఖపట్నం, అనంతరం కర్ణాటకలోని మంగళూరు, పాదూరుల్లో తొలిదశలో ఆయా నిల్వ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ పరిధిలో ఐ.ఎస్‌.పి.ఆర్‌.ఎల్‌. సంస్థను ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో మొట్టమొదటి నిర్మాణపనులను విశాఖలో 2008 జనవరిలో ప్రారంభించారు. 

సింధియా ప్రాంతంలో సముద్రం ఒడ్డునున్న ఎత్తయిన కొండ కింది భాగంలో సముద్రమట్టానికి 300 అడుగుల దిగువన భారీ క్రూడ్‌ కేవెర్న్‌ నిర్మించారు. ఏకంగా 30మీటర్ల ఎత్తు, 20మీటర్ల వెడల్పున 5కి.మీ. పొడవునా ఐదు విభాగాలుగా రూపుదిద్దారు. చమురు గుహపై సుమారు వందమీటర్ల కన్నా ఎత్తైన కొండ ఉండడంతో ఆ ప్రాంతంలో భారీబాంబులు వేసినా గుహలోని చమురు చెక్కుచెదరదు. గుహకు సహజసిద్ధమైన భద్రత ఉండేలా ముందస్తు ప్రణాళికతో నిర్మించడం విశేషం. రిక్టర్‌ స్కేలుపై ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినా చమురు గుహకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. సముద్ర మట్టానికి 300 అడుగుల కింది భాగంలో భారీ చమురు గుహను నిర్మించడానికి అధికారులు చాలా శ్రమించాల్సి వచ్చింది. నిర్మాణ ప్రాంతానికి మనుషులను, సామగ్రిని తీసుకెళ్లడానికి వీలుగా తొలుత 12మీటర్ల ఎత్తు, 8మీటర్ల వెడల్పున 4కి.మీ. సొరంగాన్ని తవ్వాల్సి వచ్చింది. గుహ నిర్మాణం పూర్తికాగానే దాన్ని కాంక్రీటుతో మూసివేశారు.

స్వీడన్‌ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన ఆ నిర్మాణం కొలిక్కి రావడానికి సుమారు ఏడేళ్ల సమయం పట్టింది. 2014 డిసెంబరు 30న నిర్మాణం పూర్తయినా రకరకాల పరీక్షల అనంతరం 2015 మే నుంచి ఇందులో ముడిచమురును నింపడం ప్రారంభించారు. 2015 అక్టోబరు వరకు దశలవారీగా చమురును తెచ్చి గుహ మొత్తాన్ని దానితో నింపేశారు. విశాఖ చమురు గుహ నిల్వ సామర్థ్యం 1.33 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కాగా, మంగళూరు గుహ 1.5ఎం.ఎం.టి., పాదూరు గుహను 2.5ఎం.ఎం.టి. సామర్థ్యంతో నిర్మించారు. వాటి నిర్మాణానికి మొత్తం రూ.4,098కోట్ల ఖర్చయింది. విశాఖ గుహలోని చమురుతో 24 రోజులపాటు, మంగుళూరు దాంతో 27రోజులు, పాదూరు గుహలోని చమురుతో 47 రోజులపాటు దేశం మొత్తానికి ఇంధనం సరఫరా చేయవచ్చు.  చమురు గుహకు మూడు కి.మీ.ల దూరంలో సముద్రంలో ఉన్న ఎస్‌.పి.ఎం.(సింగిల్‌ పాయింట్‌ మూరింగ్‌) నుంచి చమురును నేరుగా పైపులైన్ల ద్వారా గుహలోకి తరలించవచ్చు. చమురు గుహ నుంచి ఎలాంటి లీకేజీలు భూమి పొరల నుంచి బయటకు రాకుండా ‘హైడ్రాలిక్‌ కంటైన్మెంట్‌’ అనే శాస్త్రీయ సూత్రం ఆధారంగా పనిచేసేలా గుహపై భాగంలో ‘వాటర్‌ కర్టెన్‌ టన్నెల్స్‌’ను నిర్మించారు. ఫలితంగా చమురుగుహలో ఉండే చమురు 60 నుంచి 80 ఏళ్ల పైబడి అలాగే ఉంటుంది. ఆలోపు దాన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు. గుహలో ఉండే చమురును తీవ్ర సంక్షోభాలు, విపత్తులు తదితర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాలని తీర్మానించారు.