Monday, September 23, 2019
Follow Us on :

యాదాద్రి ఆలయ గోడలపై కేసీఆర్ ఫోటోలు.. వివరణ ఇచ్చిన అధికారి కిషన్ రావు

By BhaaratToday | Published On Sep 7th, 2019

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రకారంలోని మండప స్తంభాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖచిత్రం ఉండడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆలయ గోడలపైనా, స్తంభాలపైనా సీఎం కేసీఆర్, కారు బొమ్మలు చిత్రించడం వివాదాస్పదమవ్వడంతో యాదాద్రి ఆలయ ప్రత్యేక అధికారి కిషన్ రావు వివరణ ఇచ్చారు. 

ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సహజమేనని చెప్పుకొచ్చారు. అహోబిలం పుణ్యక్షేత్రంలో నెహ్రూ, గాంధీ బొమ్మలున్నాయని వివరించారు. ప్రత్యేకంగా ఫలానా బొమ్మలు చెక్కాలని తాము శిల్పులకు చెప్పలేదని, ఎవరి బొమ్మలు చెక్కాలనేది శిల్పుల ఇష్టమని తెలిపారు. కేవలం బాహ్య ప్రాకారంలోనే ఈ బొమ్మలున్నాయని, ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కిన బొమ్మలు కావని కిషన్ రావు స్పష్టం చేశారు. 

ఈ వివాదంపై తెలంగాణ బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అసలు అలాంటి పనులు చేయడానికి కారణం ఏమిటి.. యాదాద్రి ఆలయ గోడలు, స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, కారు బొమ్మ, ఆయన తీసుకొచ్చిన పథకాలను చెక్కడం కేసీఆర్ కు తెలిసే జరుగుతోందా అని ప్రశ్నించారు. దీనికి బాధ్యులు ఎవరో తెలుసుకొని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ స్తంభాలను వెంటనే తీసేయాలనీ.. తొలగించకుంటే తెలంగాణ ప్రజలతో కలిసి తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. యాదాద్రి ఆలయం ఏ ఒక్కరిదీ, ఏ పార్టీదీ కాదని.. దాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత అనీ, ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు, పార్టీ జేబుల నుంచి డబ్బులు పెట్టడం లేదని, ప్రజల సొమ్ము అని రాజాసింగ్ ఫైర్ అయ్యారు.