Friday, December 06, 2019
Follow Us on :

శ్రీ‌దేవిది హ‌త్యే...స‌హ‌జ మ‌ర‌ణం కాదు...!

By BhaaratToday | Published On Jul 13th, 2019

- నీటి తొట్టెలో పడి చనిపోవడం అసాధ్యం
- ఇది ముమ్మాటికి హ‌త్యే
- కేర‌ళ మాజీ డీజీపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి మరణం మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీదేవి మరణించి ఏడాది దాటినా ఆమె మరణంపై ఇంకా సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె మ‌ర‌ణంపై కేర‌ళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్‌సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీదేవిది హత్యేనని, ఆమె మరణంలో కుట్ర కోణం దాగి ఉందంటూ...‘మునిగి చనిపోయి ఉండకపోవచ్చు’ అంటూ ఓ దిన పత్రికకు వ్యాసం రాశారు. అందులో అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్‌ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్‌ తనతో పంచుకున్నారని వ్యాసంలో చెప్పుకొచ్చారు.
 
‘ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా.. అడుగు లోతు ఉండే నీటి తొట్టెలో పడి చనిపోవడం అసాధ్యం. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తి పట్టి.. తలను నీటిలో ముంచి ఉంటారు. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే అవకాశం లేదు’ అని ఉమాదత్తన్‌ తనతో చెప్పినట్లు రిషిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అయితే, ఆయన ఇటీవలే మరణించారని తెలిపారు. దుబాయ్‌లో ఓ వేడుకకు హాజరైన శ్రీదేవి.. గత ఏడాది ఫిబ్రవరి 24న బాత్‌టబ్‌లో మునిగి మరణించిందని యూఏఈ ఫోరెన్సిక్‌ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
 
శ్రీదేవి మరణంపై అప్పట్లోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా, కేరళ మాజీ డీజీపీ కూడా కుట్ర కోణంపై సందేహం వ్యక్తం చేశారు. ఆమె ప్రమాదవశాత్తు చనిపోయి ఉండకపోవచ్చని, హత్య అయి ఉండవచ్చని డాక్టర్‌ ఉమా దత్తన్‌ తనతో అన్నట్లు ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.