Friday, March 22, 2019
Follow Us on :

వివేకాను హత్య చేశారు.. ఒంటి మీద ఏడు కత్తి పోట్లు

By BhaaratToday | Published On Mar 15th, 2019

 వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌ మార్టాన్ని వైద్యులు పూర్తీ చేశారు. వివేకా శరీరంపై ఏడు కత్తి పోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చి చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆయనది హత్యేనని తేల్చేశారు.   

భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆయన కుటుంబసభ్యులు భౌతికకాయన్ని స్వగృహానికి తరలిస్తున్నారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పులివెందులకు చేరుకున్నారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం.. చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గురువారం ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్‌రూంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పనివారు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన అకాల మరణంపై అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ ఆయన తొడపై కత్తి పోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.  వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి తెలిపారు. పులివెందుల ఆస్పత్రి వద్ద అవినాశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఆయన తలపై రెండు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. చేతి, మొహంపై కూడా గాయాలు కనబడుతున్నాయని చెప్పుకొచ్చారు. 

ఆయన పడివున్న ప్రాంతంలో రక్తపు మరకలు కనిపించడంతో, ఉన్న‌తాధికారులు డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. బాత్ రూములో ఆయన కాలుజారి పడివుండవచ్చని, ఆ సమయంలో తలకు దెబ్బ తగిలివుండవచ్చని భావిస్తున్నా, పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ 175 కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసు విచారణ అంశాన్ని పరిశీలిస్తామని, ఆయ‌న మృతిపై వ‌స్తున్న అనుమానాలు విచార‌ణ‌లో తేలుతాయ‌ని కడప ఎస్పీ వెల్లడించారు.