Saturday, August 24, 2019
Follow Us on :

తాను వ‌చ్చే వ‌ర‌కు శ‌వ ప‌రీక్ష‌లు చేయ‌వ‌ద్ద‌న్న కుమార్తె..

By BhaaratToday | Published On Mar 16th, 2019

పులివెందుల్లో మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు తలకు ముందువైపు, వెనుక వైపు పదునైన ఆయుధంతో దాడి చేశారు. అలాగే కుడిచేతిపై, తొడపై కూడా మరో రెండు గాయాలయ్యాయి. మృతదేహంపై ఏడు గాయాలున్నట్లు శవపరీక్ష వైద్యులు నిర్ధరించారు. 
అయితే చ‌నిపోయిన స‌మ‌యంలో తలపైన తీవ్ర గాయాలుసరిగా కనిపించకపోవడంతో అర్ధరాత్రి నిద్రలో గుండెపోటు వచ్చి రక్తం కక్కి పెనుగులాటలో తలకు గాయమై ఉండవచ్చునని అంద‌రూ భావించారు. పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో అర్బన్‌ సీఐ శంకరయ్య అక్కడకు చేరుకున్నారు. మృతిపట్ల అనుమానాలు ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష చేసేందుకు వైద్యులను పిలిపించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునిత హైదరాబాద్‌లో డాక్టర్‌ వృత్తిలో ఉన్నారు. సంఘటన ఆమెకు తెలిసిన వెంటనే శవపరీక్ష తాను వచ్చే వరకు చేయవద్దని, తాను ద‌గ్గ‌రుండి చ‌నిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకుంటాన‌ని, వైద్యులను సిద్ధంగా ఉంచాలని చెప్పడంతో ఆమె వచ్చేవరకు శవపరీక్ష నిర్వహించలేదు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వివేకానందరెడ్డి కుమార్తె పులివెందులకు చేరుకున్నాక రిమ్స్‌ వైద్యులు ప్రొఫెసర్‌ ఆనంద్‌, డీసీహెచ్‌ పద్మజ, డాక్టర్‌ జ్యోత్స్న, పులివెందుల వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహించారు. శవపరీక్ష నిర్వహించడంతో మృతదేహంపై ఉన్న గాయాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో పోలీసులు హత్యేనని భావించారు. మరోపక్క హత్య జరిగిన ప్రాంతంలో డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీమ్‌లు వచ్చి అక్కడ పరిసరాలను పరిశీలించాయి. క్లూస్‌టీమ్‌ కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కర్నూలు డీఐజీ నాగేంద్రకుమార్‌ పులివెందులకు వచ్చి హత్యపై విచారించారు. సందర్శకులకోసం మృతదేహాన్ని వివేకానందరెడ్డి ఇంటి గార్డెన్‌లో ఉంచారు. శనివారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.