Sunday, August 18, 2019
Follow Us on :

ఫ్యాన్స్ గాలికి సైకిల్ పంక్చ‌ర్‌

By BhaaratToday | Published On May 23rd, 2019

రావాలి జగన్, కావాలి జగన్ అంటూ వైఎస్ఆర్సీపీకి ఏపీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ తుది ఫలితాల్లో ఊహకందని విధంగా ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఇంతకాలం విజయంపై ధీమా వ్యక్తం చేసిన అధికార పార్టీ టీడీపీని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఫ్యాన్ జోరుకు సైకిల్ పంక్చర్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ సునామీ సృష్టించింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చిన ఫ్యాన్ ధాటికి సైకిల్ పంక్చర్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం వైసీపీ గెలుపు ఖాయమనుకున్నారే గానీ.. ఊహకందని విజయాన్ని తన సొంతం చేసుకుంది వైసీపీ. మొత్తం 175 స్థానాలు కలిగిన ఏపీ అసెంబ్లీలో... స్థానాల్లో జయకేతనం ఎగురవేసి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో సంబురాలు చేసుకుంటున్నాయి. మిఠాయిలు తినిపించుకున్నారు. డప్పులు, నృలత్యాలతో సంబురాల్లో మునిగి తేలారు. అటు తాడేపల్లితో పాటు... ఇటు కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ వద్ద కూడా పండగ వాతావరణం నెలకొంది. 

మరోవైపు.. ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వెలిబుచ్చారు. 

ఇక.. వైసీపీ విజయగాధ వెనుక కఠోర శ్రమే ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాద యాత్ర చేసి ప్రజలతో మమేకమవ్వడం, పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచనలు వైసీపీ విజయబావుట ఎగురవేయడానికి దోహదం చేశాయని విశ్లేషకుల భావన. 

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. 25వ తేదీన వైసీపీ శాసనసభా పక్షం సమావేశం ఉంటుందని.. ఇందులో శాసనసభా పక్ష నేతగా జగన్ ను ఎన్నుకుంటామని పార్టీ నేతలు తెలిపారు. అటు.. ఈ నెల 30న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇక అంచనాలకు మించి ఫలితాలు రావడంతో వైసీపీ అధినేత వైఎస్.జగన్.. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహుర్తంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీతో ఫోన్‌లో  మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

మొత్తంమ్మీద పాదయాత్రలు చేసేవారిని ప్రజలు గుండెలకు హత్తుకుంటారని మరోసారి రుజువైంది. తమ కోసం వచ్చిన జగన్‌ను రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ప్రజలు ఘనస్వాగతం పలికారు.